Saturday, November 1, 2008

వ్యాయామంతో "తీవ్రమైన గుండెపోటు" దూరం

వ్యాయామంతో "తీవ్రమైన గుండెపోటు" దూరం

గుండెజబ్బుతో బాధపడుతున్నవారు ప్రతిరోజూ వ్యాయామం చేస్తే, తీవ్రమైన గుండెపోటు సమస్య నుండి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఓ తాజా అధ్యయనం వెల్లడిస్తోంది. మెడికల్ జర్నల్ ఆఫ్ అమెరికన్ అకాడమీకి చెందిన న్యూరాలజీ విభాగం వారు అక్టోబర్ 21, 2008న పై అధ్యయన వివరాలను ప్రకటించారు.
.
అధ్యయనం వివరాలేంటంటే... ఈ పరిశోధనలకుగానూ వీరు గుండెజబ్బులతో బాధపడుతోన్న 265 మంది రోగుల మెడికల్ రికార్డులను పరిశీలించగా, వారిలో 68 మంది ఆరోగ్య పరిస్థితి మిగతా వారితో పోలిస్తే మెరుగ్గా ఉన్నట్లు గుర్తించారు. గుండెజబ్బు తీవ్రత, ఇతర వ్యాధులు, శారీరక పరిస్థితి లాంటి విషయాలన్నింటినీ పరిశీలిస్తే 68 మంది రోగుల ఆరోగ్యం బాగా ఉన్నట్లు వైద్యులు పరిశీలించారు.
.
మిగిలిన వారికంటే 68 మంది రోగుల ఆరోగ్యం మెరుగ్గా ఉండటానికి కారణం ఏంటని పరిశీలించగా, వీరు ప్రతిరోజూ వ్యాయామం చేస్తున్నట్లు గుర్తించారు. శారీరక వ్యాయామం చేయటం వల్లనే గుండెజబ్బు తీవ్రత నుండి, ఇతర వ్యాధుల నుండి ప్రమాద స్థాయిని దాటి ఆరోగ్యంగా ఉన్నట్లు గమనించారు.
.
అంతేగాకుండా... దాదాపు 25 మంది ప్రజలు ఎవరైతే ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నారో, అలాంటివారు గుండెజబ్బు తీవ్రత నుండి బయటపడుతున్నారని ఈ అధ్యయనంలో తాము కనుగొన్నట్లు వైద్యులు చెబుతున్నారు. వ్యాయామం చేస్తున్నవారు జబ్బు తీవ్రత నుండి బయటపడటమే గాకుండా, క్రమక్రమంగా శారీరకంగా మెరుగుపడుతూ ఆరోగ్యవంతులవుతారని వారు పేర్కొన్నారు.
.
పై అధ్యయనానికి నాయకత్వం వహించిన డెన్మార్క్‌లోని బిస్‌పర్‌జెరగ్ యూనివర్శిటీ హాస్పిటల్‌కు చెందిన లార్స్ హెన్రిక్ క్రారప్ మాట్లాడుతూ... వ్యాయామం అనేది గుండెజబ్బు తీవ్రత ప్రమాద స్థాయిని తగ్గించటమే కాకుండా, అదుపులో ఉంచడానికి ప్రయత్నిస్తుందని అన్నారు.
.
వ్యాయామం అంటే... నడవటం, పరుగెత్తటం లాంటివి మాత్రమే కాకుండా, ఇంటిపనులు చేయడం, లాన్‌లో నడవటం, తోటపని, చిన్న చిన్న ఆటలు ఆడటం లాంటివి కూడా వ్యాయామం పరిధిలోకి వస్తాయి. కాబట్టి చిన్న చిన్న పనులు చేస్తూ కూడా గుండెజబ్బు తీవ్రత ప్రమాదం నుంచి కొంతమేరకు బయటపడవచ్చని లార్స్ సూచిస్తున్నారు. అంతేగాకుండా, గుండెజబ్బులను తగ్గించటంలో వ్యాయామం పాత్ర, ప్రాధాన్యతలను తెలియజేస్తూ, క్యాంపెయిన్లను కూడా నిర్వహించాలని ఆయన చెప్పారు.